" నా తెలంగాణ కోటి రత్నాల వీణ" బ్లాగు రచయిత శ్రీ గుండు మధుసూదన్ తో బ్లాగిల్లు ఇంటర్వ్యూ ( స్పెషల్ )

అవి తెలంగాణా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు..
పత్రికల్లో , టీవీల్లో ఎక్కడ చూసినా నాయకుల మాటల తూటాలు ..
ఇక బ్లాగుల్లో సరే సరి .. టపాల్లోనూ , వ్యాఖ్యల్లోనూ ఇరు ప్రాంతాల బ్లాగర్లూ ఒకరి నాయకులను మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ , ఒకరి ఉద్యమాలను మరొకరు విమర్శించుకుంటూ తమ తమ వాదనలను సమర్ధించుకుంటూ ఉంటే ,ఒక తెలంగాణా కవి కేవలం తన కలం నుంచి జాలువారిన పద్యాలను భాణాలుగా తన బ్లాగు ద్వారా సంధించారు.. !!
ఎటువంటి చంధస్సునైనా అవలోకగా ప్రయోగిస్తూ ఆయన సంధించిన టపాలు కొందరికి  ఆలోచననూ , కొందరికి ఆశ్చర్యాన్నీ, కొందరి ఉద్రేకాన్నీ కలిగించాయి.
ఒకవైపు ప్రసంశలేకాదు, విమర్శలు చుట్టుముట్టినా తను చేపట్టిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన కరడుగట్టిన తెలంగాణావాది ఆయన ..
ఆయన గుండు మధుసూదన్ గారు .



రీలు గురియించు తెలగాణ నేల కొల్లఁ
గొట్టఁ దగునని యాంధ్రులుఁ గూడి, దుష్ట
మార్గ మవలంబనము సేసి, మనల బాని
సలుగ మార్చి, "యాంధ్ర ప్రదేశ్" స్వంత రాష్ట్ర
మనుచు భావించి, దోచిరి మనల నాఁడు!
నేఁటి దాఁకను దోపిడి నిలుప కుండఁ;
గడుపు మండియుఁ దెలగాణ విడిచి పొమ్మ
టంచు నుద్యమమ్ములఁ జేయ నక్కజముగఁ
బ్రభుత తెలగాణ రాష్ట్రమ్ము రాజిల నిడె!
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!!
 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhjl7r4Bjz2JxYX2zntnN6E-_QiMAv6jZinboprTIDtbSvkZxq2N8v3OM2-JG677KJd0BMP19NRAj-FCCNtXVeWsepVl__IpN0tWxFrnl5vkSH0Ca1_QIraNimTt0c9kH4YeIoNnVN79Tfh/s1600/*
అంటూ " నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అనే తన బ్లాగు ద్వారా శ్రమించిన తెలుగు భాషా పండితుడీయన
ఈయనకు "తెలంగాణా"  అనే పదం శ్వాస అయితే " తెలుగు బాష" ప్రాణం లాంటిది. 
ఈయనతో "బ్లాగిల్లు" జరిపిన ఇంటర్వ్యూ చదవండి ... 
ప్రశ్న : మీ గురించి విపులంగా తెలుపుతారా ? 
 నేనొక ప్రథమశ్రేణి తెలుగు పండితుడిని. వరంగల్లు జిల్లాలోని ప్రభుత్వ
ఉన్నత పాఠశాల, శంభునిపేటలో పనిచేస్తున్నాను. నాకు మొదటినుంచీ తెలుగు సాహిత్యమంటే చాలా ఇష్టం. అందుకే స్వయంగా గ్రంథపఠనంచేసి, పద్యంపై పట్టుసాధించాననే అనుకొంటున్నాను. నేనెంతవరకు కృతకృత్యుణ్ణయ్యానో మీవంటివారలే చెప్పాలి. నా ప్రథమ బ్లాగు "మధుర కవనం"లో తెలంగాణ కవిపండితులు 
శ్రీకంది శంకరయ్యగారి శంకరాభరణంలో నేను రాసిన పూరణములన్నీ ప్రచురించి,
సుకవిపండితబృందానికి అందిస్తున్నాను.

 ప్రశ్న : మీ వ్యక్తిగత విషయాలు, మీ విద్యాభ్యాసం గురించి కాస్త చెపుతారా ? 

పూజ్యులు, కీర్తిశేషులు మా నాన్న శ్రీ గుండు రామస్వామిగారి ప్రోత్సాహంతో ఐదవతరగతి వరకు ఐదు శతకాలను నేర్చుకొని, ఆరు, ఏడు, ఎనిమిది తరగతులలో పోతనభాగవతంలోని గజేంద్ర మోక్షణం, ప్రహ్లాదచరిత్ర, రుక్మిణీ కళ్యాణం ఘట్టాలను నేర్చిన నేను, కేవలము పదవతరగతి వరకు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చదువుకొని,
చిన్ననాటనే వివాహమైనందున,ఇంటి పరిస్థితులు అనుకూలించక, ఒక షాపులో గుమాస్తాగా పనిచేస్తూ, ప్రైవేటుగా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, కాకతీయ దూరవిద్యా కేంద్రం నుండి పీజీ సాధించి, టీపీటీ పొంది, వివిధ ప్రైవేటు
పాఠశాలల్లో చాలీచాలని జీతంతో జీవనం గడిపి, చివరికి డీఎస్సీ1994లో వరంగల్లులోనే ప్రప్రథమునిగానిలిచి "తెలుగు పండిత"వృత్తిని చేపట్టాను. భగవంతుడు నాకు ఈ వరాన్నిచ్చినందుకు కృతజ్ఞుడనై వున్నాను.

ప్రశ్న : బ్లాగు వ్రాయాలన్న కోరిక మీకు ఎలా కలిగింది?
 
 తెలంగాణ అరవై ఏండ్లుగా ఆంధ్ర పాలకుల చేతిలో మోసగింపబడుతూ, అనేక
బాధలనందుతుంటే...కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మొదలవగా, నా వంతు బాధ్యతగా
తెలంగాణ ప్రజలను నా పద్యాలతో, గేయాలతో మేలుకొలుపాలనీ, ఆంధ్ర అక్రమార్కుల
దౌర్జన్యాలను అందరికీ తెలియజేయాలనీ, ముఖ్యంగా ఆంధ్రాపాలకుల, అక్రమార్కుల
దౌష్ట్యాలను ఎత్తిచూపడం ద్వారా వాళ్ళ ఆటలు సాగకుండా అడ్డుకోవడానికి
ప్రజలు నేతలు ఉద్యమించడానికై "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" బ్లాగును
ప్రారంభించాను.

 ప్రశ్న ; మీ బ్లాగు " నా తెలంగాణ కోటి రత్నాల వీణ" గురించి ఇంకాస్త ? 
 నా  బ్లాగు "నా తెలంగాణ కోటి రత్నాల వీణ"లో ఒక సగటు తెలంగాణవాదిగా తెలంగాణ ప్రజలకై వారి స్థాయిననుసరించి (పద్యాలను, గేయాలను, వచన కవితా ప్రక్రియలను అనుసరించి) సీమాంధ్రుల దౌర్జన్యాలను బహిర్గతం చేస్తూ టపాలు ప్రచురిస్తున్నాను. ఇలా రాసే అవకాశం నాకు కలగడం నా అదృష్టంగా
  భావిస్తున్నాను. అరవై ఏండ్ల ఆంధ్రవలస పాలనలో తెలంగాణ పొందిన ఖేదాన్ని సహింపలేక, ఉద్వేగంతో తెలంగాణులను మేలుకొలుపడానికై కవితను ఆశ్రయించాను.తెలంగాణ రాష్ట్రసాధనలో నేనూ ఒక పాత్రధారినైనందుకు గర్విస్తున్నాను.
ప్రశ్న : మీరు పద్యం అనే ఆయుధాన్ని ఎందుకు ఎంచుకున్నారు ? 
 పద్యమంటే నాకు ఎంత ఇష్టమో...నా "మధుర కవనం"లోనూ, "నా తెలంగాణ కోటి రత్నాల వీణ"లోని ప్రారంభ పద్యాలలోనూ ప్రస్ఫుటమవుతుంది. తెలంగాణ రాష్ట్రావతరణ తదుపరి నేను రచనలు కొంతవరకు
ప్రక్కనుంచి, నమస్తే తెలంగాణలో ప్రచురించిన "సీమాంధ్ర దురాగతాలకు సంబంధించిన" అంశాలను టపాలుగా ప్రచురిస్తున్నాను. ఇందుకు ఈ మధ్య నాకు ఏర్పడిన అనారోగ్య పరిస్థితులే కారణమయ్యాయి. మునుముందు గేయాన్ని, పద్యాన్ని పాఠకుల స్థాయిననుసరించి ప్రచురించగలను. "తెలుఁగు పద్యంబు
నిత్యమై తేజరిల్లు" అనేది నా నినాదం. తెలుగు పద్యాన్ని నశించిపోకుండా కాపాడి భావితరాలకు అందించాలనేదే నా తపన.
 ప్రశ్న : మీ బ్లాగులో వ్యతిరేకంగా వచ్చిన కామెంట్లపై మీరు ఎలా స్పందించేవారు?
 నా బ్లాగులో ఎన్నో వ్యతిరేకవ్యాఖ్యలు వచ్చాయి. ఆంధ్ర అక్రమార్కులు,
ఆంద్రపాలకులు మనను దోపిడీలతో బాధల్లోకి నెడుతుంటే వ్యతిరేకించినందుకు
స్పందించిన ఆంధ్ర ప్రజలు తెలంగాణులకు జరిగిన ద్రోహాన్ని
గుర్తించకుండా...ఆ అక్రమార్కులనూ, స్వార్థ ఆంధ్ర పాలకులనూ
సమర్థిస్తూ...తెలంగాణులను తెలబాన్‍లు, తాగుబోతులు, గోచీగాళ్ళు,
సోమరిపోతులు, తెలివిలేనివాళ్ళు, భాషరానివాళ్ళు, కవులు లేనివాళ్ళు...అంటూ
అనేకవిధాలుగా నిందిస్తూ వ్యాఖ్యలు రాశారు. అంతేకాదు...నన్ను కూడా
చెప్పుకోవడానికి కూడా వీలు లేని బూతులు తిట్టారు...మొద్దు సుద్ద
అన్నారు...కవివి కావు అన్నారు...పదాడంబరం తప్ప విషయం...కవిత్వం
లేదు..అన్నారు...ఎన్నో విధాలుగా అబద్ధాల రాతలతో...అసమంజసమైన రాతలతో నన్ను
ఇబ్బందులకు గురిచేశారు...పని కట్టుకుని నన్ను నిందించడానికే వ్యాఖ్యలు
రాశారు...కొన్ని అసమంజసమైన వ్యాఖ్యల్ని నేను ప్రచురించక..స్పామ్‍లో
పెడితే..కొందరైతే నన్ను కించపరుస్తూ తమ బ్లాగుల్లో టపాలు పెట్టి...వారి
పాఠకులు, వీక్షకులచేత తిట్టించారు...చులకన చేయించారు. అయినా నేను
జంకలేదు, వెనుకంజవేయలేదు. అన్నింటికీ ఎదురొడ్డి ముందుకు దూసుకుపోయానే
తప్ప ఆగలేదు. మునుపటికన్న ఎక్కువ టపాలతో వాళ్ళను ఎదుర్కొన్నాను.
తెలంగాణుల అదృష్టవశాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా...ఆంధ్ర అక్రమార్కుల
దౌష్ట్యాలు ఇంకా ఆగలేదు...ఎక్కడ సందుదొరికినా అక్రమాలు చేస్తూనే
వున్నారు. అవి నమస్తే తెలంగాణ పత్రికద్వారా బహిర్గతం కావడం...వాటిని
ప్రత్యేకంగా పేర్కొంటూ నా బ్లాగులో ప్రచురించడం చేస్తున్నాను. నా ధ్యేయం
అన్యాయాన్ని ఎదుర్కోవడం...ప్రజలకు తెలియజేయడం..తద్యారా ఆ అన్యాయాన్ని
ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేసి, న్యాయాన్ని జరిపించడం...! నేను చాలా
వరకు కృతకృత్యుడనయ్యాననే అనుకొంటున్నాను. తద్వారా ఎంతో తృప్తిని
పొందాను!
ప్రశ్న : మీ బ్లాగులో సీమంద్రులను ఎక్కువగా విమర్శిస్తారన్న ఆరోపణ ఉంది

తప్పు . మా  దృష్టిలో సీమాంధ్రులంటే అక్రమార్కులు...సీమాంధ్ర ప్రజలుకారు! సీమాంధ్ర ప్రజలు మా సోదరులు! మమ్మల్ని దోచుకున్నవారు సీమాంధ్ర అక్రమార్కులు, దోపిడీదారులు, దగాకోరులు! మా పోరాటం (అహింసాయుతం) సీమాంధ్ర అక్రమార్కులపైనే!

 ప్రశ్న : మీకు అత్యంత ఆనందం కలిగిన సందర్ధం .. ( బ్లాగు లోకంలో కూడా )...
  నేను ఏ ఆశయంతోనైతే బ్లాగును ప్రారంభించానో ఆ ఆశయం..."తెలంగాణ రాష్ట్ర
సాధన" నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలంగాణ ఏర్పడిన ఆనందం నాకు
ఉద్యోగం లభించినప్పుడు కూడా పొందలేదు. అరవై ఏండ్ల తెలంగాణులకల సాకారం
కావడంకంటే మరో ఆనందం ఏముంటుంది?  తెలంగాణ బంగరు తెలంగాణగా మారేంతవరకూ
విశ్రమించను. టపాలు రాస్తూనే ఉంటాను...ఆ భగవంతుడు చల్లగాచూస్తే!

మీరు వేసిన ప్రశ్నలద్వారా నా ఆశయాన్ని తమరు బహిర్గతపరిచినందుకు, ఈ బ్లాగు
ద్వారా నా తెలంగాణ ప్రజలకు "తెలుగు పద్యం తెలంగాణలో కూడా జీవించే ఉంది"
అనే విషయాన్ని తెలుపగలుగుతున్నందుకు...మీకు అనేక కృతజ్ఞతలు
తెలుపుకొంటున్నాను. నా మరో బ్లాగు"మధుర కవనం" (పద్యసాహిత్య వేదిక) ద్వారా
తెలుగు పద్యాన్ని చిరస్థాయిగా నిలుపడంలో నా వంతు పాత్రను నిర్వహిస్తాను.

 ప్రశ్న : రాష్ట్రం రెండుగా విడిపోవడంవల్ల తెలుగు బాషకు లాభమా? నష్టమా ? ఎలా ?

నష్టమనేది ఏదీ ఉండదు గాక ఉండదు అని నా అభిప్రాయం. పైగా న్యాయం
జరుగుతుంది. మొదటినుండీ ఆంధ్రవారికి తెలంగాణ పలుకుబడి అంటే చులకనభావం
ఉన్నవిషయం అందరికీ తెలిసిందేకదా! ఇప్పుడు తెలంగాణ మాండలికానికి సరియైన
గౌరవం లభిస్తుంది. ఇన్నాళ్ళూ తెలంగాణ యాసకు ఈసడింపులూ, వెకిలి నవ్వులే
తప్ప సరియైన గౌరవం దక్కలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి అగౌరవం
జరగడానికి ఆస్కారం ఉండదు. పైగా ఎవరైనా అగౌరవపరిస్తే తగిన చర్య
తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాక, ఇప్పటివరకూ ఆంధ్రలోని కవులే
కవులనీ, తెలంగాణలో కవులేలేరనీ చెబుతూ...వాళ్ళ కవుల చరిత్రలే తెలంగాణుల
చేత చదివించారు...వాళ్ళ సంస్కృతే తెలంగాణులచేత ఆచరింపజేశారు. ఇప్పుడు
తెలంగాణ అస్తిత్వం వెలుగొందుతుంది...తెలంగాణ కవులు వెలుగుచూస్తారు..స్వేచ్ఛావిహంగాలై అడ్డుకొనే ఆంధ్రా స్వార్థపరులులేక మునుముందుకు దూసుకెళ్ళుతారు...తెలంగాణ సాహిత్యాన్ని వెలిగింపజేస్తారు...తెలంగాణ సంస్కృతిసంప్రదాయాల్ని ప్రపంచానికి చాటుతారు. తెలంగాణ బాసకూ, యాసకూ ప్రాధాన్యత తెస్తారు.

 ప్రశ్న : మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి ? 

 నేను ఇంక మూడేండ్లలో పదవీ విరమణ పొందుతాను. ఆ తదుపరి నా చిన్న పుస్తక భాండాగారమందున్న ప్రాచీన
పద్య గ్రంథాలకు సులభ వ్యాఖ్యలు రాయాలనీ, నా స్వీయపద్య గ్రంథాలను ముద్రించి సాహితీ పిపాసువుల కరకమలాలను అలంకరింపజేయాలనీ, నాకున్న బోధనానుభవంతో భావి నూతన పండితులకై వ్యాకరశాస్త్రమును సులభతరము చేస్తూ పుస్తకాలు రాయాలనీ...నా కోరిక. ఇది నెరవేరుతుందో...లేదో...? నా ఆరోగ్యం
సహకరిస్తుందో...లేదో...? అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అంతా ఆయన దయ!

ప్రశ్న : ఏ రకమైన కవిత్వం అంటే మీకు ఇష్టం ? 
 నాకు చిత్రకవిత్వం అంటే చాలా ఇష్టం. ఒక పద్యంలో మరో పద్యాన్ని ఇమిడ్చి రాయడం...బంధ కవిత్వం రాయడం నాకు ఇష్టం. అయితే, మునుముందు వీటినీ రచించి, తెలంగాణ సాహితీ జిజ్ఞాసువులకు, సుకవిపండితులకు
చేరువచేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పాఠశాల పనులతో తలమునకలై వున్నందువల్ల ఆ పని చేయలేకపోతున్నాను. పదవీవిరమణ తదుపరి ఆ బృహత్కార్యాన్ని చేపట్టాలని ఆశిస్తున్నాను.
ప్రశ్న : బ్లాగర్లకు మీరు ఇచ్చే సలహా...?

 బ్లాగర్లకు సలహా ఇచ్చేటంత గొప్పవాడిని కాను నేను! కేవలం నా
తెలంగాణకొరకు "నేను సైతం తెలంగాణ ఉద్యమానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను".
నేను ఒక సాధారణ తెలుగు భాషా పండితుడను. బ్లాగర్లకు నేనేం సలహా ఇవ్వగలను?
అయితే ఒక్క విషయం ఇక్కడ చెబుతాను...తెలంగాణకు ఎవరు అవమానం కలిగించినా,
నష్టం కలిగించినా సహించక వెంటనే స్పందించి, బ్లాగుద్వారా...పోరాడాలి.
సమస్య ప్రజల దృష్టికీ, పాలకుల దృష్టికీ తీసుకుపోవాలి...సమస్యా
పరిష్కారానికి మార్గం వేయాలి. మరొకటి...తెలంగాణ తల్లి బిడ్డలైనందుకు ఋణం
తీర్చుకోవడానికి తెలంగాణ గొప్పతనాన్నీ, తెలంగాణుల ఔన్నత్యాన్నీ ప్రచారం
చేయాలి. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుటలో తగిన విధంగా దోహదం చేయాలి.


2 comments:

  1. Thank you for highlighting this teacher cum poet cum blogger from telangana. very inspirable interview
    bv sankar
    teacher
    adilabad dist

    ReplyDelete

hit counter