భరతమాత ... వందేమాతరం ... జైహింద్ .. ఈ పదాలు వింటే , చదివితే మీకు ఎలా అనిపిస్తుంది ? మనసు పులకిస్తుంది కదా ! ఆ " భారతమాత సేవలో " పునీతులవుతున్న మన బ్లాగర్ సాయినాధ్ రెడ్డి ఏమంటున్నారో ఇక్కడ చదవండి -

"నాతోటి బాధ్యతాయుతమైన దేశ పౌరులకు స్వాగతం...భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి, భారతమాత విముక్తికై పోరాడిన వీరులను రోజు గుర్తుచేసుకుందాం. మన నేటి కోసం వారి రేపటిని త్యాగం చేసిన మహానుభావులు. వారిని మన గుండెలలో నింపుకొని, వారు మనకు ఇచ్చిన స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ది పదంలో నడుపుదాం. వారు కన్న కలలను నిజం చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్వాతంత్ర్య స్ఫూర్తితో ముందుకు అడుగులు వేద్దాం. కులం, మతం వదిలేద్దాం, చేయి చేయి కలుపుదాం.
దేశం కోసం జీవించడం అంటే మన కోసం మనం జీవించటమే. మన కర్తవ్యాలను మనం నెరవేరిస్తే చాలు. వేసే ప్రతీ అడుగు దేశం కోసం ఉండాలని ఆలోచించాలి. విశ్వవ్యాప్తంగా భారత దేశం పేరు మారుమ్రోగాలి.
దేశాభివృద్ధి అందరితోనే సాధ్యం. ఎవరో ఒకరు సాధించేది కాదు. "నాకేంటి అనే ఆలోచన నుండి మనందరం బయటకు రావాలి". అందుకోసం ప్రతీ భారతీయుడు ఈ ఐదు సూత్రాలకు కట్టుబడి ఉంటానని సంకల్పం చేద్దాం.
1. సమయపాలన పాటిస్తాను.
2. చేస్తానన్న, లేదా చేస్తున్న పని మనసుపెట్టి చేస్తాను.
3. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను.
4. అందరిని కలుపుకుపోతాను.
5. అభివృద్ధిని నా గ్రామం నుంచే ప్రారంభిస్తాను.
ఈ బ్లాగు ద్వారా మనమందరం రాబోయే 10 ఏళ్ళకు వ్యూహాలు రచించి, వాటిని సాధించేందుకు కృషి చేద్దాం. ఇక పని మొదలుపెడదాం రండి. "పైన వాక్యాలు చదివాక మీకేమనిపిస్తోంది ?
ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఈయన అనిపిస్తున్నది కదా ! ఆయన గురించి మరింత తెలుసుకోవాలని లేదూ ?!
భారతమాత సేవలో అనే బ్లాగు ద్వారా మనందరికీ సుపరిచితమైన ఈయన శ్రీపురిటిపాటి సాయినాథ్ రెడ్డి.
ఇంజినీరింగ్ చదివి ప్రస్తుతం సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న సాయినాథ్ రెడ్డి హృదయం నిండా తనను కన్న భారత దేశానికి సేవ చేసి ఋణం తీర్చుకోవాలన్న కాంక్ష బలంగా ఉంది . తాను చదివిన పుస్తకాలలోని దేశభక్తికి సంబంధించిన అంశాలను , దేశంకోసం త్యాగం చేసిన వారి జీవిత విశేషాలను ఖాళీ సమయంలో బ్లాగు ద్వారా పంచుతూ ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నారు సాయినాధ్ రెడ్డి .
ఆయనతో బ్లాగిల్లు చేసిన ఇంటర్వ్యూ విశేషాలు మీరూ చదవండి -
బ్లాగిల్లు : మీ గురించి విపులంగా తెలుపుతారా ?
సాయినాధ్ రెడ్డి : నా పేరు పురిటిపాటి సాయినాథ్ రెడ్డి. నా స్వగ్రామం మార్కాపురం-ప్రకాశం జిల్లా. మా తాతలది పిఠాపురం-తూర్పు గోదావరి జిల్లా. స్కూల్ విద్యాబ్యాసం అంతా మార్కాపురం లోనే జరిగింది.
ఇంటర్ విజయవాడ. బి.టెక్ ఎలక్ట్రికల్సూ ఇంజనీరింగ్ర్యా పేట లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళశాలలో చదివాను.
ప్రస్తుతం హైదరాబాద్ లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు చదువుతున్నాను. IPS అవ్వాలని నా ఆశయం.
బ్లాగిల్లు : బ్లాగు వ్రాయాలన్న కోరిక మీకు ఎలా కలిగింది? ఎప్పట్నుంచి వ్రాస్తున్నారు ?
సాయినాధ్ రెడ్డి :నేను 2010 నుంచి బ్లాగు రాస్తున్నాను. ఇప్పటివరకు చాలా బ్లాగులు రాసాను. కాని, భారతమాత సేవలో బ్లాగు నాకు తృప్తిని కలిగించింది. నా దాహం తీర్చింది. నా నిలువెత్తు రూపం, నా ఆలోచనల సమాహారమే భారతమాత సేవలో అనే బ్లాగు.
బ్లాగిల్లు : " భారతమాత సేవలో " బ్లాగు గురించి ...
సాయినాధ్ రెడ్డి :భారతమాత సేవలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశానికి అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకి మరియు ప్రస్తుత సమాజంలో వేసే ప్రతీ అడుగు దేశంకోసం ఉండాలని ఆలోచించే ప్రతీ పౌరుడికి ఈ వెబ్ సైట్ "అంకింతం".
బ్లాగిల్లు : ప్రస్తుతం మీరు ఇతర బ్లాగులేవైనా వ్రాస్తున్నారా ?
సాయినాధ్ రెడ్డి : సామాజిక సమరసత వేదిక అనే సంస్థకు టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నాను. వేరే బ్లాగులు ఏవి రాయటం లేదు.
బ్లాగిల్లు :ఈ బ్లాగును మీరే స్వంతంగా వ్రాస్తున్నారా? ఇందులోని విషయాలు ఎలా సేకరిస్తుంటారు ?
సాయినాధ్ రెడ్డి :80 శాతం నేను సొంతంగా పుస్తకాల నుంచి గ్రహించి, అందులోని విషయాలను కుదించి రాస్తుంటాను. 20 శాతం వికీపీడియా నుంచి అనువాదం చేస్తుంటాను.
బ్లాగిల్లు : భారతమాత సేవలో అనే బ్లాగు వ్రాయడానికి మీకు ప్రేరణ ఎలా కలిగింది ?
సాయినాధ్ రెడ్డి :నాకు స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను చదవటం అలవాటు. రోజు నిద్రపోవటానికి ముందు ఒక పేజి చదివి నిద్రపోవటం అలవాటు. వారి జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో విషయాలు ఉన్నాయని నేను భలంగా నమ్ముతాను. అందుకే, నాతొ పాటు నా తోటి పౌరులు వారి నుంచి వెలువడే స్ఫూర్తిని అందించాలనుకున్నాను. ఆ ఆలోచన రూపమే భారతమాత సేవలో అనే బ్లాగు.
బ్లాగిల్లు : ప్రస్తుతం మనదేశంలో స్వార్ధం , హింసా పెచ్చరిల్లుతున్నాయి . దీనికి ఎవరు బాధ్యులు అని మీరు అనుకుంటున్నారు ?
సాయినాధ్ రెడ్డి :దేశ ప్రజలే..
బ్లాగిల్లు : మన పెద్దలు కష్టపడి సాధించిన స్వాతంత్యాన్ని మనమే దుర్వినియోగం చేస్తున్నామని అంటారా ?
సాయినాధ్ రెడ్డి :దుర్వినియోగం అని నేను అనను. దాని విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నాం అని మాత్రం చెప్పగలను.
బ్లాగిల్లు : దీనికి పరిష్కారం ఏమిటి ?
సాయినాధ్ రెడ్డి :పౌరులందరూ ఏకమై వారికి ఏమి కావాలో, ఏమి వద్దో. నిర్ణయించుకుని. ప్రభుత్వం చేత కావాల్సిన పనిని సరైన రీతిలో, సరైన సమయంలో చేయించుకొని. దేశ పౌరులుందరూ వారి వారి భాద్యతలను సక్రమంగా పాటిస్తూ, ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను సరైన దారిలో నడపాలి.
బ్లాగిల్లు : మీ బ్లాగు ద్వారా రాబోయే పదేళ్లకు వ్యూహాలు రచిద్దాము అన్నారు అవి ఎటువంటివి ?
సాయినాధ్ రెడ్డి :అవి పౌరులే నిర్ణయించుకోవాలి. నేను నిర్ణయించేవి, అందులో ప్రచురించి అందరి సలహాలు తప్పనిసరిగా కోరుతాను.
బ్లాగిల్లు : మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి . మీ బ్లాగు ద్వారా ప్రజలలో మార్పును సాధించవచ్చు అని మీరు అనుకుంటున్నారా ?
సాయినాధ్ రెడ్డి :కచ్చితంగా నేను ఆశిస్తున్నాను.
బ్లాగిల్లు : మీరు ఉన్నత చదువులు చదివారు .ఉత్తమ వ్యక్తిత్వంతో ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళుతున్నారు IPS కావాలన్న మీ సంకల్పం , ప్రజలలో మార్పు రావాలన్న మీ కోరిక నెరవేరాలని మనస్పూర్తిగా బ్లాగర్ల తరపున కోరుకుంటున్నాను .
సాయినాధ్ రెడ్డి :ధన్యవాదములు శ్రీనివాస్ గారు. నేను బలంగా నమ్మే సిద్ధాంతం - ప్రజలు ఎప్పుడైతే వ్యవస్థలో జరిగే తప్పులను ప్రశ్నించకుండా నిశబ్దం వహిస్తారో. అప్పటివరకు దేశాన్ని ఎవరు కాపాడలేరు. ప్రజలే దేశాన్ని నిర్మించుకోవాలి. భారతమాతకు జయము కలుగుగాక.
జై హింద్.
దేశసేవకు తహతహలాడుతున్న సాయినాధ్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుందాం..
సాయినాధ్ గారి బ్లాగు : భారతమాత సేవలో మీరూ చదవండి .. చదివించండి